telugu bharati logo
తెలుగు భారతి

తెలుగు భారతి వారి జయ నామ సంవత్సర ఉగాది

కవి సమ్మేళనం పద్యాలు

స్వేచ్ఛా కవిత్వం

కవులకు ఆహ్వానం

శారద స్తుతి

జయ నామ సంవత్సర వర్ణన

సియాటల్ ని సియా(సీతా) తలం (భూమి)”   గా వర్ణిస్తూ

మలేషియా విమానం గురించి

భారత క్రికెట్ జట్టు గురించి

సమస్యా పూరణం

మందు కొట్టి మగువ మంచ మెక్కె

కవితలనల్లుట కవులకు కష్టము గాదా ?

శోధనలేలనయ్య కడు శోభను దెచ్చును సోమవారముల్

చెప్పులు చేత బట్టుకొని చెంగట నిల్చిరి నాయకాగ్రణుల్ !

సీతాపతి పైని భక్తి శీఘ్రమె విడుమా

సొరకాయకు బీరకాయ సోదరుడయ్యెన్ .

పూవులో రెండు పూవులు పూచె గనుమ

దత్తపది

కోకు,సోకు,జోకు,డోకు: అమెరికా లో తెలుగు సినిమా చూడటం

పాటలు,మాటలు,కోటలు,తాటలు: ఎన్నికల ప్రచారం

విందు,మందు,చిందు,పొందు: వివేకానందుని గురించి

చక్కని,చిక్కని,చిక్కిన,చెక్కిన: ఒక అందమైన అమ్మాయి గురించి

పద్య పరివర్తనం

" కుండ కుంభమన్న " అనే పద్యాన్ని తెలుగు మాండలీకాలకు అన్వయించి

గంగి గోవు పాలు పద్యాన్ని T20, టెస్ట్ మ్యాచ్ లకు అన్వయించి

అనువాదం

రవీంద్రనాథ్ ఠాకూర్ గీతాంజలి లో “Where the mind is without fear”

 

స్వేచ్ఛా కవిత్వం

 

కవులకు ఆహ్వానం

 

కమ్మని వేల శబ్దముల కౌముదినిచ్చెడి వాణి సేవలో

గ్రమ్మన సత్కవీంద్రుల నిరంతర సాధన యీ విధంబుగా

క్రమ్మెను చంపకోత్పల విరాజిత వాజ్ఞ్మయ శోభగా !ప్రణా

మమ్ములఁ సల్పగన్ తగును మాకును సాదర పూర్వకమ్ముగా

- మేళ్లచెరువు వర్ధని

శారద స్తుతి

 

కలుషారికి మంగళకారిణికిన్

కలితామృతకావ్యవికాసినికిన్

కలకంఠికి శ్రావ్యసుగానఝరీ

జలదాయినికిన్ నతి శారదకున్

- పోక్కునూరి సందీప్

కమలాలయ!శారద!కావ్యప్రదా!

విమలాంబరి!భారతి!వేదమయీ!

సుమనోహరభాషిణి!శుంభహరీ!

సుమధారిణి! దారిని చూపుమిటన్ !

- పోక్కునూరి సందీప్

శారద శ్రీ శుభంకరి విశాలకృపానిధి వేదగర్భిణీ

ధీరమణీ సుధాంశుజలధీ సమశీతలదృగ్విలాసినీ

భారతి ప్రజ్ఞదాయిని సుభాషిణి శాస్త్రమయీ రసోమయీ

హారమయీ సరస్వతి సుహాసిని బ్రాహ్మణి తే నమోనమః

- బులుసు మల్లిక్

జయ నామ సంవత్సర వర్ణన

 

రావమ్మా! జయనామ బాల కుసుమా ! రావమ్మ మమ్మేలగన్

శ్రీవిద్యా,సిరి, పార్వతీ వరములన్ శీఘ్రంబుగందింపగన్

దేవీ రా!మముగావ, బ్రోవ దిగిరా దేశంబు నిన్ కోరగన్

సావేరీ కరుణాంతరంగ గనుమా స్వప్నాలు సాధించగన్  

- తెన్నేరు మారుతి

వచ్చెను వసంత మాసము

తెచ్చెను తా కోయిలమ్మ తీయని పాటల్

హెచ్చెను భానుని తేజము

వెచ్చని ఆశలు మనసున విరబూయంగా !

- చుండూరు సురేష్

సియాటల్ ని సియా ( సీతా ) తలం ( భూమి )”   గా వర్ణిస్తూ

 

సీతానిలయం

ఏమి భాగ్యము

సియాటల్ మహానగర నివాసము

పూర్వజన్మకృతపుణ్యఫలము

కాదే ధగధగ మెరిసే మెర్సెరైలండ్ మణిద్వీపము

కాదే రెడ్మౌండు కుంకుమార్చిత సుమేరుశృంగము

కాదే బెల్లెవ్యూ కైలాసవాసి కాలిగజ్జెలన్ ఘోషించు వేదమంత్రము

కాదే సామమీశమీశ్వరుగొల్చు సామగానము

కాదే ఈసాక్వా మహేశ్వరామోద భాగ్యోన్నత నీల నగము

కాదే భోతలం నభోవీధికెగసిన చిదంబరము

కాదే కెంటు ముక్కంటి కంఠసీమమెరయు నీలిమణి రత్నము

కాదే రేణుతన్ గోధూళిధూసరిత నందనవనము

కాదే రైనియరు ధవళసుధావర్షమయ శ్వేతాంబరము

కాదే ఆభర్ణ్ దివ్యాభరణమ్ముల మేలిమి మంజూషము

కాదే కర్క్లాండ్ గోపురము

కాదే భారతీయ సంప్రదాయానికిది నిల్వుటద్దము

కాదే తెలుగుజాతి గర్వోన్నతికిది జైపతాకము

అవును సియాతల మహానగరము

అవునిది సీతానిలయము

అవునిది భాగ్యపురము

అవునిది శ్రీనగరము

- బులుసు మల్లిక్

మలేషియా విమానం గురించి

 

గగన సీమయందు ఘన కీర్తి నెగురుచు

జనుల తమ నెలవుల సరిగ చేర్చు

దిశ మరచి వేరు దిక్కు చనియె గాదె

మలయపురపు జెట్టు  మనసు కలచె

- డింగరి మురళి మోహన్

భారత క్రికెట్ జట్టు గురించి

 

గొఱ్ఱె మంద లాగ వెఱ్ఱి మోములతోటి

బాతు గుడ్ల బుట్ట చేత బట్టి

గంపెడాశలన్ని గంగలో కలిపేసి

విశ్వజేతలమని వింత పొగరు  

 

ఒక్క పూట(ఇన్నింగ్స్) నెగ్గి పెక్కు విందులఁ బొక్కి

తెల్లబోదురాయె తెల్లవారఁ

నింగి కెగసి త్వరగ నేలకూలుటలోన

విశ్వజేతలంచు విదితమేగ

 

బంతి విసరలేక పరువును తీసేరు

ఇంట గెలిచి బయట తుంటి నొప్పి (ఇంజురిఎస్)

పద్మ ఖేలు రత్న పుచ్చుకునుటలోన

విశ్వజేతలమనఁ వింత లేదు

- డింగరి మురళి మోహన్

సమస్యా పూరణం

 

మందు కొట్టి మగువ మంచ మెక్కె

 

నిద్ర పట్ట నీవె నిముషమై ననుగూడ

నల్లులవియె చూడ నడచు ముల్లు

లవియె విసగి పురుగు లణచగ పిచికారి

మందు కొట్టి మగువ మంచ మెక్కె

- బులుసు మల్లిక్

విందు భోజనంబు విరివిగా వడ్డించి ,

తమలపాకు జుట్టి తనదు పతికి ,

పాన్పువైపు జూచి , పాడు చీమల ద్రోలు  

మందు కొట్టి , మగువ మంచ మెక్కె .​

- లంక రవీంద్ర

కవితలనల్లుట కవులకు కష్టము గాదా ?

 

అవగతమవ్వదు బాబుకు

వివరించగ విసుగు చెందుఁ విపరీతముగా !

అవకతవక సూచనిడును

కవితలనల్లుట కవులకు కష్టము గాదా ?

- పొక్కునూరి సందీప్

భవభూతి,కాళిదాసులె

కవులనినను మాకు నెపుడు , కావలె నంటే

నువు వారి శైలి నెన్నన ,

కవితల నల్లుట కవులకు కష్టము గాదే ?

- లంక రవీంద్ర

అవగతము కాని ప్రశ్నలు

వివరింపక నెవరు గూడ విరచింపుడనన్ ,

యువకవులే యున్న సభన

కవితల నల్లుట కవులకు కష్టము గాదే ?​

- లంక రవీంద్ర

కవివిగ కవితలు జెప్పుడి ;

అవి యట్లిటుండరాదు , అంతా మాసే !

సెవి సిట్లి సిల్లుబోల "

కవితల నల్లుట కవులకు కష్టము గాదే !​

- లంక రవీంద్ర

శోధనలేలనయ్య కడు శోభను దెచ్చును సోమవారముల్

 

సాధన చేయకుండగనె సాగిరి ముందుకు ధోని సేనలున్

బాధయె నాకు గూడ తెగ బాదగ వారిని వేరు జట్టులున్ ;

మాధనమందు ధోనికి హిమాంశువు యొక్కడె యోగ్యుడవ్వగా ,

శోధనలేలనయ్య కడు శోభను దెచ్చును సోమవారముల్ .​

- లంక రవీంద్ర

చెప్పులు చేత బట్టుకొని చెంగట నిల్చిరి నాయకాగ్రణుల్ !

 

తిప్పలు తప్పవోయ్ కిరణు ! తింగరి చిహ్నము నెన్నుకొంటివే !

ఒప్పవు  పాదరక్షలని యొక్కడు గూడను జెప్పలేదటోయ్ ?

ఇప్పుడు ముప్పువచ్చె మరి , యెవ్వరు గొట్టునొ ,యెందుగొట్టునో!

చెప్పులు చేత బట్టుకొని చెంగట నిల్చిరి నాయకాగ్రణుల్ !​

- లంక రవీంద్ర

సీతాపతి పైని భక్తి శీఘ్రమె విడుమా

 

నీ తల్లి యాజ్ఞ దాటక ,

ఆ తారక రమణుడమ్ము యడరింపంగన్ ,

వాతాత్మజ! ధీటుగ నీ

సీతాపతి పైని భక్తి శీఘ్రమె విడుమా !

- తెన్నేరు మారుతి

సొరకాయకు బీరకాయ సోదరుడయ్యెన్ .

 

అరయగ రెండును కూరలె ;

మురిపెముగా జేసి తింటి ముక్కల పులుసున్ ,

తరియించుచు యుదరములో

సొరకాయకు బీరకాయ సోదరుడయ్యెన్

- తెన్నేరు మారుతి

సాంకేతిక పారీణత

అంకంబున ఫేసుబుక్కు ఆన్లైన్ ప్రేమల్

ఇంకేఁ పెళ్ళన తెలిసెను

సొరకాయకు బీరకాయ సోదరుడయ్యెన్

- కొండపల్లి నీహారిణి

పూవులో రెండు పూవులు పూచె గనుమ

 

నల్లనయ్య తనను జేరి నాట్యమాడ

కలికి వదనారవిందాన కనులు జూచి   ( గరిమల ముఖారవిందాన కనులు జూచి )

పూవులో రెండు పూవులు పూచె గనుమ

యని పలికె రాధ అధరాలు అదురుచుండ

- తెన్నేరు మారుతి

దత్తపది

 

కోకు , సోకు , జోకు , డోకు : అమెరికా లో తెలుగు సినిమా చూడటం

 

కోకును గ్రోలుతు నొక్కడు

సోకున సినిమాను జూచి సోలుచునుండన్

జోకుల దృశ్యము రాగా

డోకులు వెనువెంట గలిగె డూడూ బసవా

- డింగరి మురళి మోహన్

జోకుల పేరిట గోలలు ,

సోకులతో డోకుతెచ్చు సోదిముఖములన్

కోకులు త్రాగుతు చూచుట

బాకులనెదలో పొడిచిన బాధనె ఇచ్చున్

- తెన్నేరు మారుతి

పాటలు , మాటలు , కోటలు , తాటలు : ఎన్నికల ప్రచారం

 

ఓటరులార! రండి గెలుపోటమి మాటలు తేల్చిజెప్ప మీ

పాటుల పాతపాటలను పాలన మార్పిడిజేసి మాన్పగన్

కోటల బూజుదుల్పుటకు కోటులు లక్షలు ఖర్చులేల ?మీ

ఓటులు వేసి తీతము సరోసరి ! తాటలు దొంగ నేతకున్

- బులుసు మల్లిక్

విందు , మందు , చిందు , పొందు : వివేకానందుని గురించి

 

గుండెన్ మ్రోగె నిరంకుశంబుగ సదా గోవిందుఁ నామమ్ములే

పండెన్ సాధన రామకృష్ణని కృపన్ పారీణతన్ పొందుచున్

నిండెన్ మానసమందు లోకహితమే నిత్యైక లక్ష్యంబుగా

మండున్ జ్యోతి నరేంద్రుఁ స్ఫూర్తి మదిలో మాహాత్మ్యమున్ చిందుచున్

- పోక్కునూరి సందీప్

చక్కని , చిక్కని , చిక్కిన , చెక్కిన : ఒక అందమైన అమ్మాయి గురించి

 

చక్కని యా కనుల మెరుపు

చెక్కిలినా చిన్న విరుపు చిక్కిన నడుమున్

చిక్కని యా కురుల నలుపు

చెక్కిన దనిపించు రూపు చిక్కని చుక్కోయ్ !

- చుండూరు సురేష్

పద్య పరివర్తనం

 

" కుండ కుంభమన్న " అనే పద్యాన్ని తెలుగు మాండలీకాలకు అన్వయించి

 

తొవ్వ దారి యన్న తొక్కు పచ్చడియన్న

దూప దాహమన్నదొకటి కాదె

మాటలిట్లు వేరు మరి భావమొకటే

తెలుసుకొనుచు మనర తెలుగు వాడ

- డింగరి మురళి మోహన్

ఇట్ట రావొ! యన్న ఈసుంట రమ్మన్న

గోల లొల్లి ఘోష గోస యైన

యాసలిట్లు వేరు , బాసయొకటి గాదె

తెలుసుకొనర నీవు తెలుగువాడ !

- కొండపల్లి నీహారిణి

గంగి గోవు పాలు పద్యాన్ని T20, టెస్ట్ మ్యాచ్ లకు అన్వయించి

 

ఓర్పు నేర్పు కలసి  ఒనరగ టెస్టౌర  

దుమ్మురేపు తొంటి దూకుడాట

రాశి మిన్న యేల వాసి నొకటి చాలు

తెలుసుకొ క్రికెట్టు తెలివి తోడ

- డింగరి మురళి మోహన్

టెస్ట్ మ్యాచు జూడ టేస్టు కావలెనయ్య !

పోటుదైన వలదు పొట్టి మ్యాచు !

చావగొట్టుడందు చాతుర్యమేముంది ?

విశ్వదాభిరామ వినుర వేమ

-   తెన్నేరు మారుతి

ఇంపుగుండు నయ్య ఇరువదోవరులాట

ఐదు రోజులాట అసలు బోరు

శ్రద్ధ గలుగు మ్యాచు జాలునొక్కటైన

తెలుసుకొనర నీవు తెలుగువాడ !

- కొండపల్లి నీహారిణి

అనువాదం

 

రవీంద్రనాథ్ ఠాకూర్ గీతాంజలి లో “Where the mind is without fear”

 

ఎక్కడ నీమదే భయము నెన్నడు నొందక వీరగర్వమౌ

నెక్కడ ప్రశ్నప్రజ్ఞయగు నెక్కడ బంధముతెంచుబంధువౌ

నెక్కడ కుడ్యముల్విరిగి యెక్కడ నుర్విసదావిశాలమౌ

నెక్కడ మాటలైవెలయు నెక్కడ సత్యము నిత్యముత్యమై

ఎక్కడ యాతనల్సఫల మెక్కడ జెందు సమున్నతీదిశన్

ఎక్కడ సద్విచక్షణము లెక్కడ సోమరి బాటలంటవో

ఎక్కడ కర్మముల్ మదినియెన్నడు ముందుకు లాగుకెళ్ళునో

అక్కడ మాతృదేశమున కక్కడ ముక్తినొసంగుమీశ్వరా !

- బులుసు మల్లిక్

 

సంక్రాంతి సంబరాల ఛాయా చిత్రాలు
ఇవిగో ఇక్కడ
సంక్రాంతి సంబరాల చలన చిత్రాలు
Welcome and Praradhana
Calendar Aavishkarana
Bhogi Pallu
BharathaNatyam Medley By TeluguBharati Students
Vinayaka Kautham KuchipudiDance
BhogiMantalu A Unique Experience
Telugu Padyaala Judges
Padyaala Potee - Level Zero
Classical Fusion Kavita Ryali Niranjana
Padyaala Potee - Level One
Telugu Bharati Presentation
Padyaala Potee - Level Two
Folk Dance Medley
Padyaala Potee Level Two
Padyaala Potee Award Ceremony
Telugu Bharati Quiz
Telugu Bharati Volunteer Appreciation
ప్రారంభోత్సవ సంబరాలు
Samavedam Sandesam for Telugu Bharati
Vighneswara Pooja
Vinayaka Prarthana
Swagatam
dhanamoolam idam jagat - Comedy Drama Scene 1
dhanamoolam idam jagat Comedy Drama Scene 2
dhanamoolam idam jagat Comedy Drama Scene 3
Kuchipudi Tillana
Swayamvaram Scene1
Swayamvaram Scene2
Swayamvaram Scene3
Swayamvaram Scene4
Swayamvaram Scene5
Swayamvaram Scene6
Swayamvaram Scene7
Swayamvaram Scene8
Swayamvaram Scene9
Swayamvaram Scene10
మన తెలుగును పదిమందికి
మనసారగ పంచుకొనగ మన సుమతీ వే
మన నీతుల బాలలెరుగ
మనవిదె భారతి కృపన్ సఫలమిడు మమ్మా!